రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2,216 మద్యం దుకాణాలకు నవంబరు 1 నుంచి కొత్త మద్యం విధానం అమలుల్లోకి రానుంది. ఈనెల 9 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్న దృష్ట్యా... ఆంధ్రా మద్యం వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుండటం వల్ల అక్కడి లిక్కర్ వ్యాపారులు అధికంగా ఆసక్తి చూపే అవకాశం ఉందనుకుంటున్నారు. ప్రధానంగా సరిహద్దులోని మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్‌లో లైసెన్స్‌ల కోసం ఏపీ లిక్కర్ వ్యాపారులు పోటీపడే అవకాశం ఉందని అబ్కారీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొత్త విధానంలో ఎక్కడైతే సక్రమంగా దుకాణాలు నడవకపోతే మరో చోటకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు.
దరఖాస్తుకు గతంలో రూ.లక్ష వెనక్కి తిరిగి ఇవ్వని రుసుం ఉండగా కొత్త విధానంలో ఆ మొత్తాన్ని ప్రభుత్వం రూ.రెండు లక్షలకు పెంచింది. 2017లో 2,216 మద్యం దుకాణాలకు ఒక్కో దుకాణానికి దాదాపు 19 లెక్కన 41,119 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా రూ.411.90 కోట్లు రాబడి వచ్చింది. తాజాగా లక్ష నుంచి రెండు లక్షలకు దరఖాస్తు రుసుం పెరగటం వల్ల 2017లో వచ్చినన్ని దరఖాస్తులే వచ్చినా.... సుమారు రూ.823.80 కోట్లు రాబడి రానుంది. కానీ ఏపీ లిక్కర్ వ్యాపారులు మద్యం దుకాణాలు దక్కించుకోడానికి పోటీ పడే అవకాశం ఉండటం వల్ల మరో పది నుంచి 20వేల దరఖాస్తులు అదనంగా వస్తాయని అంచనా.
ఇవీ చూడండి: భారత్‌లోని ఆకర్షణీయ నగరాల్లో 'హైదరాబాద్' అగ్రస్థానం