Air Travel: భారత్లో గడిచిన 11 నెలల్లో 16.44 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో ఇదే 11 నెలల్లో జరిగిన విమాన ప్రయాణాలతో బేరీజు వేస్తే 67.1శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కోటి 76లక్షల మంది విమాన ప్రయాణాలు చేయగా.. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో జరిగిన ప్రయాణాలతో పోలిస్తే 4.7శాతం ఎక్కువని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి జరిగిన ప్రయాణాలను పరిశీలించినట్లయితే విజయవాడ నుంచి 2021 ఫిబ్రవరిలో విదేశాలకు 6,775 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4,905 మంది మాత్రమే ప్రయాణించడంతో 27.6శాతం తగ్గారు. గడిచిన 11 నెలల్లో విదేశీ ప్రయాణాలను తీసుకుంటే.. అంతకు ముందు ఏడాది కంటే 37శాతం తగ్గినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
శంషాబాద్ నుంచి విదేశీ ప్రయాణాలు..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2021 ఫిబ్రవరిలో 88,421 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 63.9శాతం పెరుగుదల నమోదు చేసి 1,44,928 మంది ప్రయాణించారు. 2020-21 ఆర్థిక ఏడాదిలో గడిచిన 11 నెలల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 4,74,771 మంది ప్రయాణించగా.. ఈ ఆర్థిక సంవత్సరం అదే సమయంలో 12,30,982 మంది ప్రయాణించడంతో రెట్టింపునకు మించి ప్రయాణించినట్లయ్యింది. విశాఖపట్నం నుంచి అయితే గత ఏడాది ఫిబ్రవరిలో కేవలం 23 మంది విదేశాలకు ప్రయాణించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 733 మంది ప్రయాణించారు.
స్వదేశీ విమాన ప్రయాణాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణించిన స్వదేశీ విమాన ప్రయాణాలను పరిశీలించినట్లయితే విజయవాడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గత ఏడాది ఫిబ్రవరిలో 60,538 మంది ప్రయాణించగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 15.8శాతం తగ్గి... 50,980 మంది ప్రయాణించారు. అదే గడిచిన 11 నెలల్లో తీసుకుంటే అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించిన విమాన ప్రయాణీకుల సంఖ్యతో పోలిస్తే ఈ సంవత్సరం అదే సమయంలో ప్రయాణించిన విమాన ప్రయాణీకులు 36.9శాతం ఎక్కువని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో 9,94,737 మంది ప్రయాణించగా.. అంతకుముందు ఏడాది ఇదే ఫిబ్రవరిలో ప్రయాణీకుల సంఖ్యతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అదే గడిచిన 11 నెలల్లో ప్రయాణం చేసిన విమాన ప్రయాణీకులు 96,15,814 మంది ప్రయాణించగా.. అంతకు ముందు ఆర్థిక ఏడాది ఇదే సమయంలో ప్రయాణించిన 64,77,866 మంది ప్రయాణాలతో పోలిస్తే 48.4శాతం ఎక్కువ. విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,43, 308 మంది ప్రయాణించగా.. అంతకు ముందు ఏడాది ఫిబ్రవరిలో 1,41,924 మంది ప్రయాణించారు. అంటే ఒక్క శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది. గడిచిన 11 నెలల్లో ప్రయాణాలను తీసుకుంటే 48.4శాతం పెరుగుదల నమోదు చేసింది. కడప నుంచి ఫిబ్రవరిలో కేవలం 25 మంది మాత్రమే ప్రయాణించారు. కర్నూలు నుంచి తీసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,350 మంది ప్రయాణించినట్లు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
పెరిగిన రాకపోకలు
ఇంటర్నేషనల్, డొమెస్టిక్ విమానాల రాకపోకలను పరిశీలించినట్లయితే గత సంవత్సరం ఫిబ్రవరిలో రాకపోకలు సాగించిన విమానాల సంఖ్య కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.8శాతం తగ్గాయి. అదే గడిచిన ఆర్థిక ఏడాది 11 నెలల్లో 10.28లక్షల విమానాల రాకపోకలు సాగగా.. ఈ ఆర్థిక సంవత్సరం 15.64లక్షల విమానాలు రాకపోకలు సాగించి 52.1శాతం పెరిగినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది.
ఇదీ చదవండి: