Heroin Seized in Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు, బంగారం, మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. రకారకాల పద్ధతులలో అక్రమ రవాణా సాగిస్తున్నట్లు ఇటీవల పలు కేసుల్లో బయటపడింది. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా హెరాయిన్ అక్రమ రవాణా గుట్టును డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41.30 కోట్ల విలువైన హెరాయిన్‌ను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. ఆఫ్రికాలోని మాలావి నుంచి దోహా మీదుగా హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె లగేజీని తనిఖీ చేశారు.
ఈ క్రమంలోనే ఆమె సూట్‌కేసును డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా.. అందులో తెల్లటి పౌడర్ బయటపడింది. దీనిని హెరాయిన్ గా గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 5.9 కిలోల బరువున్న హెరాయిన్‌ను ఎవరికి అనుమానం రాకుండా సూట్‌కేసులో తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. భారతీయురాలైన సదరు మహిళ.. మాలావి నుంచి దీనిని తీసుకొని హైదరాబాద్‌లో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
నిఘా ఏజెన్సీలకు పట్టుబడకుండా జాగ్రత్తలు: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న డీఆర్ఐ అధికారులు.. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హెరాయిన్ ఎక్కడికి చేరవేయాలనుకున్నారనే దానిపై కూపీ లాగుతున్నారు. స్మగ్లర్లు మాత్రం నిఘా ఏజెన్సీలకు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. హెరాయిన్ చేరవేస్తే కొంత డబ్బు ఇచ్చేలా మహిళతో ఒప్పందం కుదుర్చుకొని.. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లాలని సూచించినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో హెరాయిన్‌ను తీసుకునే వాళ్ల వివరాలు సైతం నిందితురాలికి తెలియదని డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: Police Cought Thieves : జల్సాల కోసం యువతీ, యువకుడు చోరీల బాట.. పట్టించిన సీసీ కెమెరాలు
Hyderabad Girl Killed in US Shootout : అమెరికా కాల్పుల్లో హైదరాబాద్ యువతి మృతి
ఉరివేసుకున్న యజమాని.. కిందకు దింపేందుకు 4గంటలు ప్రయత్నించిన శునకం.. చివరకు..
రైల్వే 'వెయిటింగ్ లిస్ట్' దెబ్బ.. టికెట్ కొన్నా 2.7కోట్ల మందికి నిరాశ.. వారిలో మీరూ ఒకరా?