తెలంగాణ ప్రభుత్వం హజ్ యాత్రికుల కోసం సర్వం సిద్దం చేశారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హజ్ యాత్రీకుల కోసం హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌ను హోంమంత్రి ప్రారంభించారు.
ఎక్కడా లేని విధంగా హజ్ యాత్రికుల కోసం హైదరాబాద్‌లో సేవలందిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. గతేడాది డబ్బులు చెల్లించి హజ్ యాత్రకు వెళ్లని వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మహమూద్ అలీ పేర్కొన్నారు. 18 సంవత్సరాల తక్కువ వయసున్న వారు 65 ఏళ్ల పైబడిన వారి దరఖాస్తులను ఈ అన్‌లైన్‌లో స్వీకరించబడదని ఆయన స్పష్టం చేశారు.
హజ్ యాత్రకు వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమేరకు ఖర్చులు చెల్లిస్తున్నామని.. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని లాటరీ పద్ధతి ద్వారా యాత్రికులను ఎన్నుకుంటామని హోంమంత్రి వివరించారు.
అదృష్టం కొద్ది రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ముస్లిం సోదరులు మాస్కులు, శానిటైజర్లు వాడడం లేదని ఆక్షేపించారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లను వినియోగించాలని మహమూద్ సూచించారు.