కాలిన గాయాలతో బాధపడేవారి కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన చర్మ నిధిని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, హైదరబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్ సంయుక్తంగా ఉస్మానియా ఆస్పత్రిలో చర్మ బ్యాంకును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరై ప్రారంభించగా.. ఎమ్మెల్సీ, చీఫ్ విప్ ప్రభాకర్ రావు, హెటిరో ఛైర్మన్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు వైవి గిరి సహా పలువురు హాజరయ్యారు.
శుభపరిణామం..
అత్యవసర వైద్య సేవలు అనగానే అందరికీ గుర్తొచ్చే ఉస్మానియా ఆస్పత్రిలో చర్మ బ్యాంకును పెట్టడం శుభపరిణామమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శరీరం కాలినవారి ప్రాణాలు నిలిపేందుకు ఇలాంటి బ్యాంకు ఎంతో అవసరమని... రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోందని హోంమంత్రి వెల్లడించారు. రూ. 75 లక్షలతో చర్మనిధికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన హెటిరో.. హోంమంత్రి మహమూద్ అలీకి రూ.40 లక్షల చెక్కును అందజేశారు.
త్వరలో మరో చర్మ నిధి బ్యాంకు
పురాతన ఉస్మానియా ఆస్పత్రి భవనం స్థానంలో పేరు మార్చకుండా అదే ఆర్కిటెక్చర్‌తో కొత్త భవనం నిర్మిస్తామని మహమూద్ అలీ స్పష్టం చేశారు. దాదారు రూ.75 లక్షల రూపాయలతో చర్మ నిధిని ఏర్పాటు చేసినందుకు హెటిరో, రోటరీ క్లబ్‌లను ఆయన అభినందించారు. ఉస్మానియాతో తన అనుబంధం విడదీయరానిదన్న హెటిరో ఛైర్మన్ పార్థసారధి రెడ్డి.. త్వరలో మరో చర్మ నిధి బ్యాంకును రోటరీ క్లబ్‌తో కలిసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
శరీరం కాలిపోయిన కేసుల్లో 40 శాతం కంటే ఎక్కువ కాలిన వారికి.. రోజూ డ్రెస్సింగ్ చేసే బదులు కాలిన చోట స్కిన్ వేస్తే మూడు నెలల వరకు డ్రెస్సింగ్ అవసరం ఉండదని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జన్ వైద్యులు తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోంది. పురాతన ఉస్మానియా ఆస్పత్రి భవనం స్థానంలో పేరు మార్చకుండా అదే ఆర్కిటెక్చర్‌తో కొత్త భవనం నిర్మిస్తాం. అత్యవసర వైద్య సేవలు అనగానే అందరికీ గుర్తొచ్చే ఉస్మానియా ఆస్పత్రిలో చర్మ బ్యాంకును పెట్టడం శుభపరిణామం. శరీరం కాలినవారి ప్రాణాలు నిలిపేందుకు ఇలాంటి బ్యాంకు ఎంతో ఉపయోగపడుతుంది"
-- హోంమంత్రి, మహమూద్ అలీ
ఇదీ చూడండి: TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు, 9 మరణాలు