ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో.. సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్, ఈసీ సభ్యుడిగా ప్రతాప్లు ఎన్నికైన సందర్భంగా... హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వారిని సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని... ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని హోంమంత్రి అన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని... దేశంలో అత్యధికంగా పీఆర్పీ, ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
కేవలం రాష్ట్ర ఉద్యోగులు మాత్రమే సకాలంలో ట్యాక్స్ కడుతారని... ఆదాయపన్ను రాయితీ రెండు లక్షల యాభై వేల నుంచి పది లక్షలకు పెంచాలనే ప్రతిపాదన రాబోయే సమావేశంలో ఉంటుందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. 75ఏళ్ల చరిత్ర గల టీఎన్జీవో సంఘంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని... సెంట్రల్ యూనియన్లో తమ నాయకులకు అరుదైన గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తెలిపారు.
ఇదీ చదవండి: Praja Sangrama Yatra: కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం