కరోనా పరిస్థితుల దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రత్యేక శ్రద్ధ వహించి బక్రీద్ పండుగను జరుపుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. ఈసారి పండగ ప్రత్యేక పరిస్థితుల మధ్య జరగనుందని తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ ఇచ్చే జంతువుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని అన్నారు. పండగ ఏర్పాట్లపై హైదరాబాద్లోని తన కార్యాలయంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్లతో ఆయన సమీక్షించారు. బక్రీద్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు.
జంతువులను కొనుగోలు చేసే సమయంలో స్థానిక పశు వైద్యులు జారీ చేసిన ధ్రువపత్రాన్ని భద్రపరచుకోవాలని హోంమంత్రి సూచించారు. ఆవులు తప్ప ఇతర జంతువులను పోలీసులు అడ్డుకోరని వెల్లడించారు. చట్టం ప్రకారం ఆవులను బలి ఇవ్వరాదని స్పష్టం చేశారు.
ప్రార్థనలకు ఈద్గాలలో అనుమతి లేనందున.. మసీదులలో నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు చేసుకోవడం ఉత్తమమన్నారు. ప్రార్థనల సమయంలో భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం విధిగా పాటించాలని కోరారు.
ఇదీచూడండి: తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు