హైదరాబాద్లో వెలసిన భారీ హోర్డింగులు త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. యూనిపోల్స్, భవంతులపై కనిపించే ఫ్లెక్సీ బోర్డులు, హోర్డింగులదీ అదే దారి. ఆ మేరకు నూతన ప్రకటనల విధానంలో మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాయి. ఆయా నిబంధనలతో కూడిన విధానం అమల్లోకి రాబోతుంది. వర్షం వచ్చినప్పుడు, ఈదురు గాలులు వీచినప్పుడు జనావాసాలపై హోర్డింగులు, ఫ్లెక్సీ బోర్డులు కూలుతుంటాయి. జనజీవనంపై పలు రకాలుగా ప్రభావం పడుతుంటుంది. ఇష్టానుసారం దారిపొడవునా కనిపించే ప్రకటనలతో నగర వాతావరణమూ దెబ్బతింటోంది. ఇతర మెట్రో నగరాలు.. హోర్డింగులు, ఇతర వ్యాపార ప్రకటనలను నియంత్రించి సమస్యలను దూరం చేసుకోవడంతో అదే తరహాను పాటించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.
ఈదురుగాలులతో వర్షం కురిస్తే ఇబ్బందే..
భాగ్యనగరంలో 2,500 అధికారిక హోర్డింగులున్నాయి. ఖాళీ స్థలాల్లో ఉండే నిర్మాణాల ఎత్తు 100 అడుగులు ఉంటుంది. 60 అడుగుల స్తంభాలపై 40 అడుగుల వెడల్పు, అంతే ఎత్తుతో కనిపించే హోర్డింగులు వర్షం, ఈదురుగాలులు వీస్తున్నప్పుడు ప్రమాదకరంగా కనిపిస్తుంటాయి. వాటితో నగర అందం దెబ్బతింటుందన్న అభిప్రాయమూ ఉంది. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఉమ్మడిగా నూతన ప్రకటనల విధానాన్ని రూపొందించాయి. దిల్లీ, ఇండోర్, బెంగళూరుల్లోని నియమ నిబంధనలను అందిపుచ్చుకుని కొత్త విధానాన్ని రూపొందించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. 2020 మార్చి నాటికి జారీ చేసిన అన్నిరకాల ప్రకటనల లీజు గడువు పూర్తయిందని, వాటిని తొలగించే ప్రక్రియ వారంలో మొదలవుతుందని అధికారులు తెలిపారు.
కొత్త విధానంతో..
నూతన విధానం ప్రకారం యూనిపోల్స్ హోర్డింగుల ఎత్తు 15 అడుగులకు మించొద్దు. రోడ్డు మధ్యలో ఏర్పాటయ్యే చిన్నపాటి లాలీపాప్ ప్రకటనలు కొనసాగుతాయి. నిర్మాణాలపై ఎలాంటి ప్రకటనలకు అనుమతి లేదు. భవన నిర్మాణం ముందువైపు(ఎలివేషన్) యాజమాన్యం ఏర్పాటు చేసుకునే ప్రకటన విస్తీర్ణం.. మొత్తం విస్తీర్ణంలో 15 శాతానికి మించొద్దు. నగరవ్యాప్తంగా కొత్తగా నిర్మించనున్న 2 వేల బస్టాపుల్లో, 2 వేల ప్రజా మరుగుదొడ్ల గోడల మీద, కాలిబాటలపై ఏర్పాటు చేసే కుర్చీలు, ఇతర నిర్మాణాలపై(స్ట్రీట్ ఫర్నిచర్) ప్రకటనలకు అనుమతి ఉంటుంది.
ఇదీచదవండి 53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి