ORR Controversy Latest Updates : హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లీజు వివాదం రోజురోజుకి తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు, నేతల మధ్య సాగుతున్న ఈ వివాదం ఇప్పుడు హెచ్ఎండీఏ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే లాగా మారిపోయింది. ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు ఇవ్వగా.. దానిపై ఆయన ఘాటుగానే స్పందించారు. తనకు ఇచ్చిన లీగల్ నోటీసును ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి హెచ్చరించారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ నగర మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అర్వింద్‌కుమార్ సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవుటర్ రింగ్ రోడ్డు సగ భాగం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. అధిక ఆదాయం వచ్చే ఆవకాశం ఉన్నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7వేల 380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్‌ను కట్టబెట్టారని ద్వజమెత్తారు.
HMDA responded to Revanth Reddy comments on ORR Issue : దీనిపై తాజాగా హెచ్ఏండీఏ సైతం స్పందించింది. ఓఆర్‌ఆర్ టీఓటీ వ్యవహారంలో ఎంపీ రేవంత్ రెడ్డికి జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. అధికారులు, సంస్థ పనితీరుపై అపోహలు, రాజకీయ ఉద్దేశాలను ఆపాదించడం, ప్రత్యేకంగా అధికారుల పేర్లను ప్రస్తావించారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ధేశిత మార్గదర్శకాలకు లోబడి, ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ పనిచేస్తుందన్న విషయాన్ని ఎంపీ మరవరాదని హితవు పలికారు.
- ORR Controversy Latest Updates : 'ఓఆర్ఆర్ వివాదం'పై HMDA లీగల్ నోటీసులు.. రేవంత్ సమాధానమిదే
- ORR lease agreement scam : 'దిల్లీ లిక్కర్ స్కామ్ కంటే.. ఓఆర్ఆర్ లీజు వెయ్యిరెట్ల పెద్ద స్కామ్'
అధికారులు, సంబంధిత విభాగాలు నిబంధనల ప్రకారమే తమ విధులను నిర్వహిస్తున్నారని హెచ్ఎండీఏ పేర్కొంది. టీఓటీ బిడ్ విషయంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్దేశించిన నిబంధనలను అనుసరించి ఓఆర్ఆర్ బిడ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు పునరుద్ఘాటించింది. 30 సంవత్సరాలకు టీఓటీ బిడ్ ఇవ్వాలన్నది మంత్రిమండలి నిర్ణయమేనని, ఈ తరహా 30 ఏళ్ల పాటు ఎన్ హెచ్ఏఐ కూడా రెండు బిడ్లు ఖరారు చేసిందని పేర్కొంది.
బిడ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులందరూ పారదర్శకంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి విధులు నిర్వహించారని పేర్కొంది. ఎంపీ రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా అడిన ప్రశ్నలకు సమాధానాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించామని తెలిపారు. ఓఆర్ఆర్ టీఓటీ బిడ్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఆపారన్న ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. అధికారిక విధినిర్వహణలో బెదిరింపులకు గురికావడం, భ్రమలకు ఆస్కారం లేదని.. సంస్థను, అధికారులను రక్షించుకునేందుకు చట్టపరంగా అవసరమైన అన్ని చర్యలను చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: