కోకాపేటలోని 49.92 ఎకరాల ప్రభుత్వ భూముల ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో ఉన్న హెచ్ఎండీఏ కార్యాలయంలో వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నారు. హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కోకాపేటలో ఉన్న భూములను విక్రయించేందుకు ఆన్లైన్ వేలాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రేపు ఖానామెట్ భూముల వేలం
ఖానామెట్ లేఅవుట్‌లోని 15.01 ఎకరాలు.. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ(TSIIC)కి చెందిన హైటెక్ సిటీ(HITECH CITY) సమీపంలో ఉన్న ఖానామెట్ లేఅవుట్‌లోని 15.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 5 ప్లాట్లకు రేపు వేలం నిర్వహించనున్నారు. ఇక్కడున్న అన్ని ప్లాట్లు 2, 3 ఎకరాల చొప్పున విస్తీర్ణంలో ఉన్నాయి. ఎకరానికి కనీస వేలం ధర రూ. 25 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం... రూ.20 లక్షల చొప్పున వేలం పెంచుకోవచ్చని ప్రకటించింది. కనీస ధరకు భూముల విక్రయం అయినా రూ.1623 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి.
ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా..
ప్రస్తుతం విక్రయిస్తున్న భూములన్నీ బహుళ ఉపయోగ జోన్ కిందకు వస్తాయి. అంటే ఈ భూములను ఆఫీస్, ఐటీ, గృహ, విద్యా సంస్థలు, కమర్షియల్ వినియోగం కోసం ఈ భూములను ఉపయోగించుకోవచ్చు. భూముల వేలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎమ్‌ఎస్‌టీసీ (MSTC) వెబ్ సైట్ ద్వారా జరగనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లాంటి వాణిజ్య ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఈ భూముల వేలం విజయవంతంగా సాగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కోకాపేటలోని నియోపోలీస్ లేఅవుట్‌ను హెచ్ఎండీఏ (HMDA) ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసింది.
కోట్లు రాల్చనున్న భూములు
గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినపుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. ఈసారి దీనికి మించి రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధరపలికే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు వేలంలో పాల్గొంటున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నియోపోలిస్ వెంచర్ (Neopolis Kokapet Venchar) ఏర్పాట్లన్నింటిని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ (Chief Secretary of the Municipal Department Arvind Kumar) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వెంచర్ లోపల వంద అడుగుల రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను రేపు వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్ మైల్ (Golden Mile)అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Lands E-auction: జీహెచ్‌ఎంసీ పరిధిలో 64.93 ఎకరాల భూమి వేలం