హైదరాబాద్ నగరంలో రోడ్లను సిగ్నల్ రహిత రహదారులుగా మార్చేందుకు ప్రవేశపెట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధిలో చేపట్టిన మరో ప్రాజెక్టు గ్రేటర్ వాసులకు అందుబాటులోకి రానుంది. రూ.66.59 కోట్ల వ్యయంతో నిర్మించిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇవాళ ప్రారంభించనున్నారు.
దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్యూబీ ప్రారంభంతో హైటెక్ సిటీ-ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్డీపీ మొదటి దశలో గచ్చిబౌలి నుంచి జేఎన్టీయూ వరకు చేపట్టిన పలు పైవంతెనలు, అండర్ పాస్లు బయో డైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్ గాంధీ జంక్షన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ ఆర్యూబీ నిర్మాణానికి ముందు ఈ బ్రిడ్జి కింద ప్రతి రోజూ 35 వేల నుంచి 40 వేల లీటర్ల నీరు ఊరేది. ఈ నీటితో అండర్ బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. ఇక భారీ వర్షాలు పడితే అక్కడి పరిస్థితులు వర్ణనాతీతంగా ఉండేవి. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయడానికి బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట్ సర్కిల్లో నాటిన హరితహారం మొక్కలకు నీరందించనున్నారు. ఇప్పటికే దాదాపు రూ.1010 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన 18 ప్రాజెక్టులు నగర పౌరులకు అందుబాటులో వచ్చాయి. రూ.4741 .97 కోట్ల వ్యయంతో చేపడుతున్న మరో 20 పనులు పురోగతిలో ఉన్నాయి.
ఇదీ చదవండి: యాదాద్రీశుని ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం