యాభై ఏళ్ల హీరాబాయి పరదేశి... భూపాల్‌లోని హిమిదియా ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. రోజూ విధులు ముగించుకుని పక్కనే ఉన్న గుడిలో కాసేపు గడుపుతుందామె. ఇక్కడే ఆమె తన సాయం కావాలనుకునే వ్యక్తులను కలుస్తుంది. వృత్తిపరంగానే కాకుండా మరో మహోన్నత కార్యక్రమం ద్వారా ఆమె జనాలకు సేవలను అందిస్తోంది. అనాథ శవాలకు అన్నీ తానై అంత్యక్రియలను నిర్వహిస్తోంది. కరోనా సమయంలోనూ ఈ సేవలను కొనసాగించింది.
2700 శవాలకు అంత్యక్రియలు..
భూపాల్ ప్రజలకు ఆమె చిరపరిచితురాలే. అక్కడివారు ఆమెను ప్రేమగా ‘హీరా బువా’ (హీరా అత్తా) అని పిలుస్తారు. గత ఇరవై నాలుగేళ్లుగా అనాథ శవాలకు, శవాన్ని దహనం చేసేందుకు డబ్బులు కూడా లేని పేదవారికి అండగా ఉంటూ దహన సంస్కారాలను పూర్తి చేస్తోంది. దాదాపు ఇప్పటి వరకు 2700 శవాలకు అంత్యక్రియలను నిర్వహించింది. ఓసారి ఓ పెద్దావిడ తన కొడుకు దహన సంస్కారాలకు సాయం చేయమని అడిగింది. అప్పటి నుంచి ఈ క్రతువు మొదలైంది.
నన్ను తాకేందుకు భయపడతారు..
ఎక్కడ ఏ అనాథ శవం ఉన్నా, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదటి ఫోన్ కాల్ వెళ్లేది హీరాకే. తన ఈ సామాజిక సేవ ద్వారా భూపాల్‌లోని అన్ని ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్‌లన్నీ ఆమెకు చిరపరిచితమే. అయితే ఈ సమాజ సేవలోనూ తను అవమానాలనూ ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో. ‘ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోనూ కొంతమంది ఇంకా అనాగరికంగా ఆలోచిస్తున్నారు. కులాల సంకెళ్లను కాళ్లకు వేసుకుంటున్నారు. నేనలా అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తాను కాబట్టి నన్ను తాకడానికి చాలామంది భయపడతారు. శవం తరఫున వచ్చిన బంధువులను కులం, మతం ఏదని అడగను. నేను చేసే పనిని దైవంగా భావిస్తా ’ అని చెబుతోందామె.
మరోవైపు ఆమె చేస్తున్న సేవను అభినందిస్తూ ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘సమాజ్ సేవా సమ్మాన్’, సమాజ్ రత్న సమ్మాన్, ‘ఉమెన్ ప్రౌడ్ హానర్’, అంబేడ్కర్ సేవా సమ్మాన్’ లాంటి పురస్కారాలను హీరా అందుకున్నారు. ‘ఈ అనాథ శవాల అంత్యక్రియలను నేను చనిపోయే వరకు నిర్వహిస్తూనే ఉంటా’ అని చెబుతోందామె.