మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను చాలా బాధకు గురిచేసిందన్నారు. లోతైన విషయ పరిజ్ఞానమున్న ప్రణబ్ ముఖర్జీ.. రాష్ట్రపతి, ఆర్థిక మంత్రిగా దేశానికందించిన సేవ మరువలేనిదన్నారు. ఆర్ధిక సంస్కరణల అమలులో సైతం వీరి పాత్ర కీలకమైనదని అభివర్ణించారు. తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు వారిని కలిసి అనేక విషయాలు చర్చించేవాడినని గుర్తు చేసుకున్నారు.
ప్రణబ్ ముఖర్జీ మృదు స్వభావి అని, మంచి జాతీయ భావాలు, విశాల దృక్పథం కలిగిన గొప్ప నేత అని, వారు మూడు తరాల రాజకీయ నాయకులను ప్రభావితం చేసిన గొప్ప నాయకుడని దత్తాత్రేయ కొనియాడారు. భారతదేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని, వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం