గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం మరణం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో బాలు ఒకరని.. ఆయన మరణం అభిమానులకు, సంగీతప్రియులకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలు అని పిలుచుకునే ఎస్పీ బాలసుబ్రమణ్యం గొప్ప సంగీతకారుడిగా, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్, చలన చిత్ర నిర్మాతగా అన్ని రంగాల్లో రాణించారని గుర్తు చేశారు. ఎంతోమంది నటుల హావభావాలకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారని, సంగీత మాధుర్యాన్ని సంగీత ప్రియులకు పంచారని అన్నారు.
2004లో తాను ప్రారంభించిన వందేమాతరం సెంటినరీ కమిటీకి ఎస్పీ బాలు వైస్ ఛైర్మన్గా సేవలందించారని దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. ఆయన మనందరినీ విడిచి వెళ్లడం చాల బాధాకరమని.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడి వేడుకొంటున్నానని దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఇదీ చదవండిః బాలు పార్థివదేహానికి అశ్రునివాళి- భారీగా తరలిన జనం