ఆర్టీసీలో 5100 పర్మిట్లకు అనుమతిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మంత్రిమండలి నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. మంత్రిమండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని హైకోర్టు మరోసారి ఏజీని ప్రశ్నించింది. మంత్రిమండలి నిర్ణయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం లేదని.... ప్రభుత్వ ఉత్తర్వులుగా బయటికి వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తాయని ఏజీ హైకోర్టుకు తెలిపారు.
సెక్షన్ 102 ప్రకారం
ఆర్టీసీలో 5100 పర్మిట్లు ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకునే ముందు సెక్షన్ 102 ప్రకారం ఆర్టీసీ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాలని... కానీ ఇక్కడ అలా జరగలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. మంత్రిమండలికి చట్టప్రకారం ఉన్న విచక్షణాధికారాల ప్రకారం పర్మిట్లు జారీ చేశారని అడ్వొకేట్ జనరల్ ధర్మాసనానికి వివరించారు.
సోమవారం వరకు మధ్యంతర ఉత్తర్వులు
పిటిషనర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఆర్టీసీలో పర్మిట్ల బదులు.... రాష్ట్రంలో రూట్ పర్మిట్లు అనే పదాన్ని చేర్చి తిరిగి వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. అంగీకరించిన పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. మార్పులు చేసి రేపు మరో పిటిషన్ దాఖలు చేస్తానని విన్నవించారు. రూట్ పర్మిట్లపై సోమవారం వరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై మంత్రిమండలి ఏ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుందని పిటిషనర్ ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు ప్రశ్నించారు.
ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ