గవర్నర్ కోటా కింద ఇటీవల ఎన్నికైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్ త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ ముగ్గురి ఎన్నిక రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ సామాజిక కార్యకర్త ధనగోపాల్ గతంలో పిల్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 11న మేయర్, ఉపమేయర్ ఎన్నిక జరగనున్నందున ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరపాలని న్యాయవాది కోరగా న్యాయస్థానం నిరాకరించింది.
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కల్పించడాన్ని సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది. ఇప్పటివరకు కౌంటరు ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటరు దాఖలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరగా.. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణ ఆగస్టు 25కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసు అనిశా పరిధిలోకే వస్తుంది : కోర్టు