న్యాయవాది తిరుమలరావు కరోనా పరీక్షలపై రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కరోనా పరీక్షలను ప్రైవేట్ లేబొరేటరీల్లో ఉచితంగా నిర్వహించే అవకాశాలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పరీక్షకు రూ.4 వేల 500
వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ లేబొరేటరీలకు అనుమతినిచ్చిందని.. వాటిలో రూ.4 వేల 500 తీసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే వివిధ వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని.. పరీక్షల కోసం వేల రూపాయలు వసూలు చేయడం తగదన్నారు. ఐసీఎంఆర్ 1200 రూపాయలకే పరీక్షలు జరుపుతోందని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే పరీక్షలు
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే పరీక్షలు జరుపుతున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. స్పందించిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం.. ప్రైవేట్ లేబొరేటరీల్లో పరీక్షలు ఉచితంగా చేయలేరా... ఒకవేళ సాధ్యం కాకపోతే ఎందుకో వివరిస్తూ ఈనెల 8లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్న నిధులు, చేయూతపై వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవీచూడండి: ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన