ఈ ఏడాది మొదటి వడగాలుల తీవ్రత ఖమ్మంలో నమోదైంది. ఆ జిల్లాలో వరుసగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతోపాటు 18 జిల్లాలను వడగాలుల తీవ్రత జాబితాలో చేర్చారు. కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మరింత ముప్పు ఉంది. ఈ నెల 2 నుంచి 6 వరకు ఈ జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రాంతంలో కొద్దిరోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగినా, 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనా ఆ ప్రాంతంలో వడగాలుల తీవ్రత ఉన్నట్లు అంచనా వేస్తారు.
నీడ పట్టునే ఉండాలి..
చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. ఎక్కువ సమయం ఆరుబయట ఉంటే శరీరం వాతావరణంలోని వేడిని గ్రహిస్తుందని, ఇది ప్రమాదకరమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు నీడపట్టున ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే వడదెబ్బ తాకే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఫ్యాన్లను తక్కువ వేగంతోనే తిప్పాలని, ఏసీలు 24 డిగ్రీలలోపే ఉండేలా చూడాలని సూచిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం కుతకుత..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 44.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బూర్గంపాడు, ములకపల్లిలలో 44, జూలూరుపాడు 43.8, లక్ష్మీదేవిపల్లి, దమ్మపేట 43.4, కొత్తగూడెం 43.1 పాల్వంచ 43, టేకులపల్లి, సుజాతానగర్, ఇల్లెందులలో 42.6 డిగ్రీలు నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ తెలిపింది.
యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం
వడగాలుల ముప్పును ఎదుర్కొనేందుకు కలెక్టర్లను అప్రమత్తం చేశాం. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేశాం. ఉపాధి కూలీలకు నీడ కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ పొట్లాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించాం. జిల్లాల్లో పరిస్థితిని బట్టి కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. - రాహుల్ బొజ్జా, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్
పొడిగాలుల వల్లే..
దేశం ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రం వైపు పొడిగాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నాలుగైదు రోజులు వీటి ప్రభావం ఉంటుంది. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడటంతో భూ ఉపరితలంపై ఉన్న తేమ అటువైపు వెళ్తోంది. దీనివల్ల కూడా తేమశాతం తగ్గి వేడి ఏర్పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.- డాక్టర్ నాగరత్న, డైరెక్టర్, వాతావరణ శాఖ
18 జిల్లాలకు వడగాలుల ముప్పు
* 2వ తేదీ: జగిత్యాల, కరీంనగర్, వరంగల్ అర్బన్
* 2,3 తేదీలు: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జోగులాంబ గద్వాల
* 2, 3, 4 తేదీలు: ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి
* 2 నుంచి 6 వరకు: కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్
ఇదీ చూడండి: త్వరలో ఎన్నికల నగారా మోగనున్న వేళ.. నేడు ఖమ్మంకు కేటీఆర్