హైపవర్ కమిటీ మూడో సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది. సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ.. ఆ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ స్థానంలో అమరావతి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై హైపవర్ కమిటీ చర్చించింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేయనుంది.
హైపవర్ కమిటీ ప్రతిపాదనలు !
ప్రత్యేకించి కాజ టోల్ గేటు నుంచి అమరావతి సీడ్ కేపిటల్ ప్రాంతం నుంచి విజయవాడకు యాక్సిస్ రహదారి నిర్మాణానికి సిఫార్సు చేయనుంది. ఈ పనులను మే- జూన్లలో ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు వద్దనుకునే రైతులకు భూమిని తిరిగి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. అందుబాటులో ఉన్న వేరే భూమి కేటాయింపులకు సంబంధించిన అంశాన్నీ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
మాస్టర్ ప్లాన్ సాధ్యం కాదు!
2014కు కంటే ముందు సాగు చేసి ఇప్పటికీ సాగు కొనసాగిస్తున్న రైతుల జాబితాలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో కమిటీ ఉంది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ తరహా అభివృద్ధి సాధ్యం కాదని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం