High Demand Passports In Telangana : రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీలో పారదర్శకతను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున అపాయింట్‌మెంట్స్ సంఖ్యను పెంచుతామని ఆమె వెల్లడించారు. పాస్‌పోర్టుల జారీలో హైదరాబాద్ రీజియన్, దేశంలో ఐదో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.
Passport Services In Hyderabad : భారత్ నుంచి విద్య, ఉద్యోగం, పర్యాటకం లాంటి వివిధ అవసరాల కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్టుల కోసం జనం ఎగబడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ వరకు కోటి 50 లక్షల పాస్‌పోర్టులు జారీ అయ్యినట్లు పాస్‌పోర్టు అధికారి జొన్నలగడ్డ స్నేహజ వెల్లడించారు.
రాష్ట్రంలో ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా రోజుకు నాలుగు వేల దరఖాస్తులు ప్రాసెస్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తత్కాల్ పాస్‌పోర్టు దరఖాస్తుదారుల అపాయింట్‌మెంట్ కోసం 4 నుంచి 5 రోజులు, సాధారణ పాస్‌పోర్టుల కోసం 22 రోజులు పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు.
Passport: ఏప్రిల్ 29 నుంచి హైదరాబాద్‌లో స్పెషల్ పాస్‌పోర్ట్ డ్రైవ్
పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే విధానం సులువు చేశాం. పాస్‌పోర్టు విషయంలో మధ్యవర్తులను, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దు. బ్రోకర్లను నమ్మి మోసపోయినట్లు తమకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసరంగా పాస్‌పోర్టు కావాల్సి వస్తే తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే అవసరాన్ని బట్టి వీలైనంత త్వరగా పాస్‌పోర్టు వచ్చేట్లు చూస్తాం. -పాస్ పోర్టు అధికారి, స్నేహజ
Passports Demand In Telangana : ఈ ఏడాది అక్టోబరులో పుట్టినవారి ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని స్నేహజ స్పష్టం చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు పాన్‌కార్డు, పదో తరగతి మార్కుల మెమో లాంటి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. పాస్‌పోస్టు దరఖాస్తు చేసుకోవడం చాలా సులువంటున్న స్నేహజ మద్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అత్యవసరంగా పాస్‌పోర్టు కావాల్సి వస్తే తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే అవసరాన్ని బట్టి వీలైనంత త్వరగా పాస్ పోర్టు వచ్చేట్లు చూస్తామని ఆమె చెప్పారు.
రాష్ట్రంలో పాస్‌పోర్టులకు పెరుగుతున్న రద్దీ విషయాన్నివిదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి దరఖాస్తుల ప్రాసెస్ కోసం అపాయింట్‌మెంట్ల సంఖ్యను పెంచుకునే దిశలో ముందుకు వెళ్లుతున్నట్లు తెలిపారు. పోలీసు, తపాలాశాఖల సహకారంతోనే తాము ప్రజల డిమాండ్‌కు తగినట్లు పని చేయగలుగుతున్నట్లు ఆమె వివరించారు.
ప్రవాస భారతీయులకు సులభంగా ఆధార్
ఫారిన్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ప్రయాణ బీమా మస్ట్! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!