High Court Fires On Information Commissioners Spaces : సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌పై హైకోర్టు విచారణను చేపట్టింది. విచారణలో భాగంగా ఏజీ ప్రసాద్ ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ఇంకా ఈ నోటిఫికేషన్‌కు ఆగస్టు 4 వరకు గడువు ఉందని ఏజీ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. సమాచార కమిషన్, హెచ్‌ఆర్‌సీ వంటివి ఖాళీగా ఎందుకు పెడుతున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. సమాచార కమిషనర్లు లేని పరిస్థితే తలెత్తవద్దని హైకోర్టు.. ఏజీ ప్రసాద్‌కు తెలిపింది. ఈ సమాచార కమిషనర్ల నియామకంపై విచారణను ఆగస్టు 23కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
సీఆర్పీఎఫ్ భూముల్లో ఉన్న పేదలను ఖాళీ చేయించవద్దు : మియాపూర్‌లోని సీఆర్పీఎఫ్ భూమిలో ఉంటున్న నివాసితులకు అంతరాయం కలిగించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 23లోగా కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులో పేర్కొంది. నివాసితులకు అంతరాయం కలిగించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మియాపూర్‌లోని 40 ఎకరాల సీఆర్పీఎఫ్ భూమిలో.. పేదలు 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ మేరకు వెంటనే ఖాళీ చేయాలని.. నివాసితులకు ప్రభుత్వాలు తెలిపాయి. దీనిపై ఈ భూములలో పేదలను ఖాళీ చేయించవద్దని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని మేరకు హైకోర్టు విచారణ చేపట్టి.. నివాసితులకు అంతరాయం కలిగించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
దర్శకుడు శంకర్‌కు భూకేటాయింపుపై విచారణ వాయిదా : దర్శకుడు శంకర్‌కు భూకేటాయింపుపై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఇందుకు సంబంధించిన తీర్పును ఈనెల 7కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. రంగారెడ్డి జిల్లా మోకిలలో డైరెక్టర్ శంకర్‌కు 5 ఎకరాల భూమిని.. స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు వ్యతిరేకంగా శంకర్‌కు భూకేటాయింపులు ఎలా చేస్తారని హైకోర్టులో పిల్ వేశారు. అందుకు సమాధానంగా కళాకారులకు ప్రభుత్వాలు గతంలో కూడా భూములు ఇచ్చాయని హైకోర్టు తెలిపింది.
కులాల వారీగా భూములు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కమ్మ, వెలమ కుల సంఘాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమిని నిలిపివేసింది. గ్రామీణ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ వంటి అణగారిన వర్గాలకు కేటాయిస్తే ఒక అర్థం ఉందని హైకోర్టు తెలిపింది. ఇలా బలమైన కులాలకు భూములు ఎందుకు ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది.
ఇవీ చదవండి :