TS High Court Notice On Preethi Death: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు.. హత్యనా.. లేక ఆత్మహత్యనా అనేది స్పష్టంగా తెలియడం లేదు. వరంగల్ సీపీ రంగనాథ్ ఆమెది ఆత్మహత్యే అని తేల్చి చెప్పినా సరే.. దానిని హత్యగానే భావిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు. ఈ అనుమానాలపైనే తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.మల్లయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి.. విచారణను చేపట్టింది. ఆ విచారణలో వైద్య విద్యార్థి ప్రీతి మృతిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై స్పందన తెలపాలని సీఎస్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, డీఎంఈ, వరంగల్ సీపీ, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అనస్థీషియా విభాగం అధిపతికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.
ఇంకా లేఖలో ఉన్న విషయాలు: వరంగల్ కాకతీయ వైద్య కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతిపై హత్య, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం అభియోగాలపై కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించాలని లేఖలో కోరారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్, అనస్థీషియా విభాగం అధిపతిని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని లేఖలో కోరారు. సకాలంలో ఛార్జిషీటు వేసి నిందితులకు మరణశిక్ష పడేలా చూడాలన్నారు. ప్రీతి కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
పాఠశాల రికార్డులు, టీసీల్లో కుల ప్రస్తావనపై హైకోర్టుకు లేఖ: మరో వ్యవహారంలో పాఠశాల రికార్డులు, టీసీల్లో కుల ప్రస్తావనపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీహెచ్‌ఈఎల్ విశ్రాంత మేనేజరు ఎస్.నారాయణ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించి విచారణ జరిపింది. ప్రవేశాల సమయంలోనే విద్యార్థుల కులం అడుగుతున్నారని.. కొన్ని చోట్ల కులధ్రువీకరణ పత్రం కోసం డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బడుల్లో కుల వివక్షను ప్రోత్సహించేలా ఉందని లేఖలో తెలిపారు. కావున పాఠశాల రికార్డులు, టీసీల్లో కులం నమోదు చేయవద్దని ఆదేశించాలని కోరారు. దీనిపై స్పందన తెలపాలని సీఎస్, విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్‌కు నోటీసులు ఇస్తూ.. హైకోర్టు విచారణను జులై 21కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: