కోర్టు ఆదేశాల అమలులో జాప్యంపై పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిపై హైకోర్టు(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారుల పదోన్నతుల వివాదంపై డీపీవోలు పద్మజ రాణి, సురేష్ బాబు 2018లో దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
పదోన్నతుల విషయంలో డీపీవోలకు అన్యాయం జరుగుతోందని.. నిబంధనలు సవరించాలని పద్మజ, సురేష్ గతంలో పంచాయతీరాజ్ శాఖకు వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఇద్దరూ కలిసి 2018లో హైకోర్టును ఆశ్రయించారు. వినతిపత్రంపై స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని 2019లో హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసి రెండున్నరేళ్లయినప్పటికీ... వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. పంచాయతీ రాజ్ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో తెలపాలని పేర్కొంటూ... విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 2024 ఎన్నికలే లక్ష్యం- రంగంలోకి మోదీ