రాష్ట్రంలో డెంగీ జ్వరాల నివారణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలు చనిపోతున్నా... సర్కారు స్పందిస్తున్న తీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేసింది. డెంగీ జ్వరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వైద్యురాలు ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. డెంగీ నివారణ కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని... దోమల నివారణ చర్యలు చేపట్టాలని గతంలో హైకోర్టు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈరోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదిక సమర్పించారు. హైదరాబాద్‌లో తమకు ఎక్కడా హోర్డింగులు, పోస్టర్లు కనిపించ లేదని... ఎక్కడా ప్రచారం చేసినట్టు లేదని వ్యాఖ్యానించింది. రేపు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సీఎస్, వైద్యారోగ్య, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు, ప్రజా రోగ్య విభాగం సంచాలకుడు, తదితర అధికారులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చూడండి: ఆసిఫ్‌నగర్ ఏసీపీ నరసింహారెడ్డిపై బదిలీ వేటు