ఆసిఫ్‌నగర్ ఏసీపీ నర్సింహారెడ్డిని బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే బదిలీ జరిగిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సోమవారం రోజు ప్రగతి భవన్ ముట్టడి చేసింది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి... ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ప్రగతి భవన్‌కు వెళ్లి ప్రధాన రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంత భద్రత మధ్య కూడా కాంగ్రెస్ నేతలు ముట్టడి చేయడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రగతి భవన్ ప్రధాన గేట్ వద్ద భద్రతా చర్యలు పర్యవేక్షించిన ఏసీపీ నంద్యాల నరసింహా రెడ్డిపై అదే రోజు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బదిలీ వేటు పడినట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సందర్భంగా అక్కడ విధులు నిర్వహించిన బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుతో పాటు... జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి పైనా సీపీ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- హాంకాంగ్ నిరసనలు... మాస్క్‌లతో మానవహారం