కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చెల్లికి తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకువచ్చిన అన్నకు నిబంధనలు అడ్డురావడంతో అన్నాచెల్లెలు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. భర్త కిడ్నీ ఇవ్వడానికి విభేదాలతో దూరంగా ఉన్న భార్య అంగీకారం తెలపకుండా ఆలస్యం చేస్తోంది. భార్య అనుమతి అవసరమని కిడ్నీ ఆపరేషన్‌కు అపోలో ఆసుపత్రి నిరాకరిస్తూ మే 29న నోటీసు పంపడంతో సికింద్రాబాద్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు కె.ఎ.వెంకటనరేన్, బి.మాధురిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్ విచారణ చేపట్టారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన సోదరికి కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించానని, అన్ని పరీక్షలు అయ్యాయనని, జులై 30న కిడ్నీ మార్పిడికి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి పేర్కొందని పిటిషనర్లు వివరించారు.
ఆసుపత్రికి ఆదేశాలు
అయితే కిడ్నీ మార్పిడికి నరేన్ భార్య అనుమతి అవసరమంటూ మానవ అవయవాల మార్పిడికి చెందిన అపోలో అధీకృత కమిటీ నోటీసు పంపడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. తెలంగాణ అవయవ మార్పిడి చట్టం ప్రకారం తాము రక్తసంబంధీకులమేనని చెప్పారు. భార్యతో అభిప్రాయభేదాలున్నాయని, వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని అపోలో ఆసుపత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చెల్లెలు భర్త తన భార్య డి.వల్లిని వాట్సాప్ ద్వారా సంప్రదించారని, దీనికి సమాధానం ఇవ్వకుండా ఎలాంటి సమాచారం రాకుండా బ్లాక్ చేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన భార్య అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువని, రోజురోజుకి చెల్లెలు ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. తక్షణం కిడ్నీ మార్పిడికి ఆపరేషన్ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
నోటీసులు జారీ
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రత్యేక పరిస్థితుల్లో పిటిషనర్ భార్య నుంచి అనుమతి తీసుకురావాలని ఒత్తిడి తీసుకురావద్దని, ఆపరేషన్ నిర్వహించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన పిటిషన్‌పై విచారణ నిమిత్తం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ వాయిదా వేసింది.
ఇదీ చూడండి: CJI Justice NV Ramana: 'తల్లిదండ్రులను చంపి.. అనాథను అన్నట్లుంది'