Hyderabad Drugs Case update : డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న వ్యాపారులను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 9 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతకుముందు కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించగా.. తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. వారం పాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది.
9మంది వ్యాపారులతో సంబంధాలు..?
High court about Hyderabad Drugs Case : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ సహా మరికొంత మందిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అందులో 9 మంది వ్యాపారులు ఉన్నారు. ఇప్పటికే టోనీని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నవారి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. టోనీ బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు అతని ముందుంచి దర్యాప్తు చేశారు. అరెస్టయిన 9 మంది నిందితులను ప్రశ్నిస్తే మరిన్ని ఆధారాలు రాబట్టవచ్చని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. నిందితులైన వ్యాపారుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది.
సంచలనంగా హైదరాబాద్ డ్రగ్స్ కేసు..
Drugs Smuggler Tony: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మత్తు దందా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల స్మగ్లర్ టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. ఏ విధంగా మాదకద్రవ్యాల సరఫరాదారుడిగా మారాడు?.. ఎవరెవరు అతనికి సహకరించారు?.. ఏజెంట్లు ఎవరు?.. వంటి వివిధ అంశాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. 2013లో అతడు ముంబయి చేరుకుని.. కొంతమంది నైజీరియన్ స్మగ్లర్ల సాయంతో మత్తుదందాలోకి దిగినట్టు బయటపడింది. కొద్దికాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఏర్పరచుకుని అంతర్జాతీయ స్మగ్లర్ స్టార్‌బాయ్ సంస్థతో సంబంధాలు కొనసాగించాడు. రెండోరోజు విచారణలో పోలీసులు స్టార్‌బాయ్‌తో కొనసాగించిన లావాదేవీలపై ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ముంబయి కేంద్రంగా ఏళ్ల తరబడి మాదకద్రవ్యాల దందా సాగించిన టోనీ ఎక్కడా వ్యక్తిగత ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే లావాదేవీలు నిర్వహించాడు.
లోతుగా విచారణ
Smuggler Tony Custody update :ఏజెంట్ల ద్వారా మత్తుపదార్థాలు చేరవేసేందుకు భిన్నంగా వ్యవహరించాడు. కాఫీషాప్‌లు, రెస్టారెంట్లు, పార్కుల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో కొకైన్ ఉంచేవాడు. సీసీ కెమెరాలు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని లావాదేవీలు నిర్వహించినట్టు సమాచారం. టాలీవుడ్‌తో సంబంధాలు, సినీరంగ ప్రముఖుడితో టోనీకి ఉన్న పరిచయాలపై పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రముఖుడి ఫోన్‌నెంబరు కూడా టోనీ వద్ద దొరికిన సెల్‌ఫోన్‌లో ఉన్నట్టు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు అన్నీ తానై మత్తుపదార్థాల లావాదేవీలు చేసినట్టు ఒకే సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ మూడోరోజు టోనీని పోలీసులు విచారించనున్నారు. విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా మరింత మందిని ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోసం హైకోర్టులో పోలీసుల పిటిషన్