High Court Permits RSS Long March in Bhaimsa: భైంసాలో ఆర్‌ఎస్‌ఎస్ లాంగ్ మార్చ్‌కు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. మార్చి 5వ తేదీన మధ్యాహ్నం లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుమతి ఇవ్వాలని నిర్మల్ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి విచారణ జరిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. భైంసా సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతమని, రెండేళ్ల క్రితం ఇక్కడ ఘర్షణలు జరిగి ప్రాణనష్టం జరిగిందని జీపీ వివరించారు. ఒక చిన్న వివాదాస్పద స్లోగన్‌తో విద్వేషాలకు ఆజ్యం పోయవచ్చునని వాదించారు.
ఊహాజనిత కారణాలతో అనుమతినివ్వడం లేదని, గతంలో టిప్పుసుల్తాన్ జయంతి ర్యాలీ వంటి కార్యక్రమాలకు ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతినిచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రదర్శన నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నేరచరిత్ర లేని 500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలని ఆదేశించింది.
మసీదుకు 300 మీటర్లకు పైగా దూరంలో ర్యాలీ జరపాలని ఆర్ఎస్ఎస్‌ను.. మసీదు వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ర్యాలీలో పాల్గొనేవారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కూడా సూచించింది.
RSS Long March in Bhainsa: ఇది వరకే భైంసాలో శాంతిభద్రతలకు విఘాతం జరగవచ్చునని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ లాంగ్ మార్చ్‌కు అనుమతివ్వలేమని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. ఈనెల 19న భైంసాలో ప్రదర్శన, సభ నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్ భావించగా.. దానికి అనుమతి ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ పోలీసులను కోరింది.
దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఆర్‌ఎస్‌ఆర్ ప్రతినిధి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఈనెల 17వ తేదీన హైకోర్టులో విచారణకు రాగా.. ఆర్‌ఎస్‌ఎస్ భైంసాలో ప్రదర్శన, లాంగ్ మార్చ్ రోజునే మరో మతానికి చెందిన ఉత్సవం ఉన్నందున అనుమతిచ్చే పరిస్థితి లేదని పోలీసులు న్యాయస్థానంలో చెప్పారు. లాంగ్ మార్చ్ మరో రోజు పెట్టుకునే అనుమతిస్తారా తెలుసుకొని చెప్పాలని ఆ రోజున ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు అడిగింది.
దానికి కూడా పోలీసులు అనుమతివ్వలేమని స్పష్టం చేశారు. పోలీసులు నిర్ణయం తీసుకొని అనుమతి నిరాకరించినందున.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేసుకునేందుకు అనుమతివ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరగా.. హైకోర్టు అంగీకరించింది. తాజాగా వేసిన పిటిషన్‌ను విచారింఇన హైకోర్టు.. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: