టీఎస్పీఎస్సీ (Tspsc) నిర్వహించిన వివిధ ప్రవేశ పరీక్షల్లో వివరాలు తప్పుగా బబ్లింగ్ చేసిన వారి ఓఎంఆర్ (OMR) సమాధాన పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దని హైకోర్టు (High Court) ఆదేశించింది. వాటిని మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాంటి ఓఎంఆర్ సమాధాన పత్రాలను పక్కన పెట్టి.. కోర్టు కేసుల వల్ల నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు తెలిపింది.
స్టాఫ్ నర్సులు, అటవీ బీట్ అధికారులు, ఎస్జీటీ, స్కూల్ అసిసెంట్లు, గురుకుల ఉపాధ్యాయలు తదితర పరీక్షల్లో... కొందరు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో తప్పులు చేశారు. పేరు, హాల్ టికెట్ సంఖ్య.. తదితర వ్యక్తిగత, పరీక్ష వివరాలను బబ్లింగ్‌లో పొరపాట్లు చేశారు. మరికొందరు వాటిని సరిచేసేందుకు రెండుసార్లు దిద్దారు. దీంతో అలాంటి ఓఎంఆర్ సమాధాన పత్రాలపై గందరగోళం ఏర్పడింది.
ఖాళీలు భర్తీ చేయలేకపోతున్నాం...
వ్యక్తిగత వివరాలే కాబట్టి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని గతంలో టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించిన పలు పిటిషన్లపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు కేసుల వల్ల వివిధ ఉద్యోగాలకు సంబంధించిన దాదాపు 40 నుంచి 60 ఖాళీలు భర్తీ చేయలేక పోతున్నామని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది బాలకిషన్ రావు తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు.. బబ్లింగ్‌లో పొరపాట్లు చేసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను మూల్యాంకానికి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. టీఎస్పీఎస్సీ ఇచ్చిన వివరాలను చదివి.. ఓఎంఆర్ షీట్లను జాగ్రత్తగా నింపాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని హైకోర్టు అభిప్రాయపడింది. వాటిని పక్కన పెట్టి.. మిగతా ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు అనుమతినిచ్చింది.
ఇదీ చదవండి: Harish rao: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై మంత్రి హరీశ్ సమీక్ష