కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1998 డీఎస్సీ మెరిట్ జాబితా విషయంలో దాఖలైన పలు ధిక్కరణ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ పీ నవీన్‌రావు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5న డీఈఓలు నలుగురు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు...
1998లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించగా... కటాఫ్ మార్కులను నోటిఫికేషన్లో పేర్కొన్నదనికంటే ఐదు చొప్పున తగ్గించడంపై చెలరేగిన వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీం ఉత్తర్వులు వెలువడ్డాక మెరిట్ జాబితాను రూపొందించాలంటూ మళ్ళీ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇదే నోటిఫికేషన్లో ఇప్పటికే చాలా భాగం పోస్టులు భర్తీ అయినందున... 20 ఏళ్లు గడిచాక ఇప్పుడు అర్హత జాబితా రూపొందించడంలో ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం భావించింది. అర్హత సాధించి పోస్టు రానివారితో అర్హత జాబితాను రూపొందించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన న్యాయమూర్తి 4 జిల్లాల డీఈఓలను హాజరు కావాలంటూ ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.
ఇవీ చూడండి: పోలెపల్లి ఔషధ పరిశ్రమల కాలుష్యంపై చర్యలకు శ్రీకారం