High Court order to increase the diploma course fees : ఈ విద్యా సంవత్సరం ఫీజును 40 వేల రూపాయలకు పెంచాలంటూ ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్ కాలేజీల్లో 40 వేల రూపాయల ఫీజును అనుమతిస్తున్నామని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. డిప్లొమా కోర్సులు అందించే విద్యా సంస్థలను రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోకి తేవాలన్న సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
పాలిటెక్నిక్ కాలేజీలను టీఎస్ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తీసుకురావాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పంపించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పిటిషనర్లు తెలిపారు. పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభమైనందున గతేడాది మాదిరిగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. డిప్లొమా కోర్సులను కూడా టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తీసుకురావాలని గతేడాది ఫిబ్రవరి 23న సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
గతేడాది ఆగస్టు, అక్టోబరులో మరోసారి గుర్తు చేస్తూ లేఖలు పంపించారు. కానీ విద్యాశాఖ కార్యదర్శి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. దీంతో విద్యా శాఖ కార్యదర్శిని వివరాలు అడిగి చెప్పాలని ఈనెల 9న ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశిస్తూ ఈనెల 12కి వాయిదా వేసింది. ఈనెల 12న ఉదయం ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో.. అదే రోజు మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
అయినప్పటికీ స్పందన లేక పోవడంతో.. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈనెల 12న వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విద్యాశాఖ కార్యదర్శికి ముఖ్యమైన అధికారిక కార్యక్రమాల్లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలపై వారంలోగా నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు.
విద్యా శాఖ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్ కాలేజీల్లో 40 వేల రూపాయల ఫీజును అనుమతిస్తున్నామని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు.
ఒకవేళ ప్రభుత్వం ఫీజు తక్కువగా ఖరారు చేస్తే విద్యార్థులకు వెనక్కి ఇచ్చేయాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది. ఒకవేళ 40వేల కన్నా ఎక్కువగా ఖరారు చేస్తే మిగిలిన డబ్బు కడతామని విద్యార్థుల నుంచి హామీ పత్రం రాయించుకోవాలని తెలిపింది. పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: