High Court On Intermediate Colleges Facilities : రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని న్యాయసేవాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అమ్మాయిలకు టాయిలెట్లు లేవని.. కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ ఎల్ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. సరూర్ నగర్ కాలేజీలో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేశామని.. రెండు శాశ్వత టాయిలెట్లు నిర్మాణ దశలో ఉన్నాయని విద్యా శాఖ హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.29.90 కోట్లు మంజూరు చేసిందని నివేదించింది. నిధులు మంజూరు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమైనట్లు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశిస్తూ పిల్‌పై విచారణను జులై 18కి వాయిదా వేసింది.
రెడ్డి కాలేజీ సొసైటీ భూసేకరణపై విచారణ : రెడ్డి కాలేజీ సొసైటీకి భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రెడ్డి కాలేజీ సొసైటీకి హైదరాబాద్‌లోని బద్వేల్‌లో రూపాయికి ఎకరం చొప్పున ఐదెకరాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు రాజేశ్వరరావు, విజయ్ కుమార్ దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ జరిపింది. భూమిని 2018లో కేటాయిస్తే ఐదేళ్లు తర్వాత ఇప్పుడు పిల్ ఎందుకు వేశారని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.
జీవోను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదని.. ఆధారాల కోసం వేచి చూడాల్సి వచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంలో జాప్యం ఎందుకు జరిగిందో వివరించడంతో పాటు.. రెడ్డి కాలేజీకి కేటాయించిన భూమి ప్రస్తుతం ఏ దశలో ఉందో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. పిల్‌పై విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.
దర్శకుడు శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి భూకేటాయింపు : స్టూడియో నిర్మాణం కోసం దర్శకుడు ఎన్.శంకర్‌కు భూమి కేటాయించడంలో తప్పేమీ లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వృత్తిపరంగా ఎలాంటి అండ లేని.. వెనకబడిన వర్గానికి చెందిన శంకర్‌కు భూమి కేటాయింపు నిబంధనల ప్రకారమే జరిగిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌లోని మోకిళ్లలో దర్శకుడు శంకర్‌కు ఎకరానికి రూ.5 లక్షల చొప్పున అయిదు ఎకరాలు కేటాయిండానికి కరీంనగర్‌కు చెందిన శంకర్ అనే నిరుద్యోగి వేసిన పిల్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ జరిపింది.
High Court On Director Shankar Cine Studio : కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం రూ. 25 లక్షలకే కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిఫార్సు మేరకు శంకర్‌కు రాయితీ ధరకు భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పద్మాలయ, అన్నపూర్ణ, రామనాయుడు స్టూడియోలకు, రాఘవేంద్రరావు, చక్రవర్తికి భూములు కేటాయించారని అడ్వకేట్ జనరల్ వివరించారు. భూమి కేటాయింపులో ఎలాంటి పక్షపాతం, నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్.శంకర్ తరఫున న్యాయవాది వాదించారు.
High Court On Land Issues : తెలంగాణ ఏర్పడిన తర్వాత స్థానికులను ప్రోత్సహించాలన్న విధానంలో భాగంగానే తనకూ భూమి కేటాయించారని శంకర్ వాదన. క్రీడాకారులు, సినీ స్టూడియోలకు ప్రభుత్వాలు భూములు కేటాయించడం దేశవ్యాప్తంగా ఉన్నదే కదా అని హైకోర్టు అడిగింది. భూకేటాయింపులపై 2007 తర్వాత చట్టాలు, విధివిధానాలు మారాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కేబినెట్ అధికారాలకు సంబంధించి పలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను సమర్పిస్తామని ఏజీ తెలిపారు. దీంతో తదుపరి వాదనల కోసం పిల్‌ను జులై 5కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి :