రక్షణశాఖ అనుమతి లేకుండా బైసన్ పోలో, జింఖానా మైదానం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బైసన్ పోలో, జింఖానా భూముల్లో అసెంబ్లీ, కళా భవన్, సచివాలయం నిర్మించకుండా అడ్డుకోవాలంటూ మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు, క్రికెటర్ వివేక్ జయసింహా, విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ అమిత్ భల్లా తదితరులు 2017లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ముగించింది.
సచివాలయం పాత స్థలంలోనే నిర్మిస్తున్నామని, అసెంబ్లీ, కళాభవన్ నిర్మాణాలు ఇంకా చేపట్టలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. బైసన్ పోలో, జింఖానా భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకరించిందని, దానికి సంబంధించిన నివేదికలు సమర్పించామన్నారు. భూముల అప్పగింతపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం స్పష్టం చేసింది.
అన్ని నిర్మాణాలకు ప్రభుత్వం వద్ద నిధులు ఉంటాయి కానీ, హైకోర్టు కోసం మాత్రం ఉండవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. త్వరలో కొత్త జడ్జిలు వస్తే కోర్టు గదులకు తగిన స్థలం లేదని ధర్మాసనం పేర్కొంది. బార్ కౌన్సిల్, అడ్వొకేట్ జనరల్ కార్యాలయాన్ని హైకోర్టు ఆవరణ నుంచి తరలించాల్సి ఉంటుందని పేర్కొంది. హైకోర్టు కోసం కనీసం డబల్ డెక్కర్ భవనాలైనా నిర్మించాలని వ్యాఖ్యానించింది. కొత్త హైకోర్టు కోసం ప్రభుత్వం గతంలో 100 ఎకరాలు కేటాయించిందని, అయితే ఆ భూమిపై హైకోర్టు ఆసక్తి చూపలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.
ఇదీ చూడండి: AP bifurcation Issues: 'కోర్టు కేసుల్ని వెనక్కి తీసుకుంటే.. సమస్యల పరిష్కారానికి సిద్ధం'