AP High Court Comments on Amaravati: ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులిచ్చిన భూముల్లో సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధంగా నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకం కింద స్థలాలు కేటాయించేందుకు వీలుగా 2020 ఫిబ్రవరి 25న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 107ను సవాలు చేస్తూ, హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు జీవో 107పై స్టే ఇస్తూ 2020 మార్చిలో ఉత్తర్వులిచ్చింది.
సీఆర్‌డీఏ చట్టానికి ‘సవరణ’ తెచ్చిన తరుణంలో జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకమంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై కౌంటర్ వేయాలని పిటిషనర్లను న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. సోమవారం ఈ వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్‌డీఏ తరఫున కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సీఆర్‌డీఏ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు ఉన్నాయన్నారు. వాటిని త్రిసభ్య ధర్మాసనం ముందుకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సాయి సంజయ్ స్పందిస్తూ ప్రస్తుత వ్యాజ్యాలకు, ద్విసభ్య ధర్మాసనం ముందు ఉన్న వ్యాజ్యాలకు ఒకదానితో ఒకటి సంబంధం లేదన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో ముందుకెళ్లబోమని ద్విసభ్య ధర్మాసనం ముందు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
బెంచ్ హంటింగ్‌కు పాల్పడుతున్నారా?: ఇరువైపు వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం, పిటిషనర్లు బెంచ్ హంటింగ్‌కు పాల్పడుతున్నారా? అని ఘాటుగా ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ ఉన్న విషయాన్ని ప్రభుత్వం, పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం ముందు ఉన్న వ్యాజ్యాలను తమ వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
ఫిబ్రవరి 27కి వాయిదా: రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ రైతులు దాఖలు చేసిన కోర్టుధిక్కరణ వ్యాజ్యాలపై సోమవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీలో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
నిర్మాణం విషయంలో గడువు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. జనవరి 31న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుందన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున తమ ముందు ఉన్న వ్యాజ్యాలను ఫిబ్రవరి 27కి వాయిదా వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: