High Court on Sriramanavami Shobhayatra: హైదరాబాద్, భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రను పోలీసుల మార్గదర్శకాల మేరకే నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్, నిర్మల్ జిల్లా భైంసాలో కొన్ని నిర్దుష్ట ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతాలు, వీధుల్లో శోభాయాత్రకు అనుమతిచ్చినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్లో సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు, ధూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, సిద్ధి అంబర్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వార, పుత్లీబౌలి చౌరస్తా మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. భైంసాలో గోపాలదాస్ హనుమాన్ ఆలయం, పాత సోనా చాందినీ, కుబేర్ అడ్డా, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా, రాంలీలా మైదాన్ల మీదుగా ఊరేగింపు నిర్వహించుకోవచ్చునని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ఇదీ చదవండి: 'కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు నిర్ణయం తీసుకోవాలి'