రాష్ట్రంలో రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వాయిదా వేయాలా లేక కొనసాగించాలా అనే అంశంపై మధ్యాహ్నం రెండున్నరలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16 వరకు ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది.
ప్రవేశ పరీక్షలతో పాటు టైప్ రైటింగ్ వాయిదా వేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలపై వివరణ ఇవ్వాలని ఏజీని ఆదేశించింది. ఒకవేళ హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తే ప్రవేశ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది.
ప్రవేశ పరీక్షల వాయిదాపై సంబంధిత అధికారులతో సీఎస్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. తెలిపారు. మధ్యాహ్నం రెండున్నర వరకు సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. అంగీకరించిన హైకోర్టు.. విచారణను మధ్యాహ్నం రెండున్నరుకు వాయిదా వేసింది.