గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాదులు సరైన విధంగా అభ్యంతరాలు తెలపనందునే.. స్టే ఆదేశాలు జారీ అవుతున్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయని.. ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఏమిటని హైకోర్టు పేర్కొంది.
నిబంధనలు, విధివిధానాలు కాగితాల్లో బాగానే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గుర్తించిన అక్రమ నిర్మాణాలు, తీసుకున్న చర్యలు, స్టేలు ఎత్తివేసేందుకు చేపట్టిన చర్యలపై నివేదికలు సమర్పించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొవిడ్ కారణాలు చూపుతూ విధుల నిర్వహణ నుంచి తప్పించుకోరాదని స్పష్టం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల కింద 10వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని చివరి అవకాశం ఇచ్చిన ధర్మాసనం.. విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
ఓయూ భూముల కబ్జాపై హైకోర్టు విచారణ
ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల కబ్జాపై దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అధికారులందరూ కొవిడ్ నియంత్రణలో నిమగ్నమై ఉండగా.. కొందరు ఓయూ భూములను ఆక్రమిస్తున్నారంటూ విద్యార్థి పి.రమణరావు రాసిన లేఖపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. సుమారు 8వేల చదరపు గజాల యూనివర్సిటీ భూమి కబ్జా అవుతోందని లేఖలో పేర్కొన్నారు. కబ్జా నుంచి భూమిని కాపాడమని.. మోసపూరితంగా రిజిస్ట్రేషన్ దస్త్రాలు సృష్టించిన తులసీ హౌజింగ్ సహకార సంఘంపై అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు జరగుతోందన్నారు. హైదరాబాద్ సీపీ, అంబర్ పేట పోలీసులను ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు.. దర్యాప్తు ఏ స్థితిలో ఉందో తెలపాలని ఆదేశిస్తూ విచారణ అక్టోబరు 20కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: