కరోనా విపత్తు వేళ రుసుముల విషయంలో విద్యా సంస్థలు మానవీయంగా వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది. బేగంపేట, రామంతపూర్ పబ్లిక్ స్కూళ్లలో ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరంట్స్ ఫోరం దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫీజులు చెల్లించలేదని 219 మంది విద్యార్థులకు 17 రోజులుగా ఆన్‌లైన్ తరగతులు బోధించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం పది శాతం ఫీజు పెంపును ఉపసంహరించుకోవడంతో పాటు.. 10వేల రూపాయలు తగ్గించినట్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) తరఫు న్యాయవాది తెలిపారు.
ఎన్ని వేల రూపాయలు తగ్గించారని కాదు.. మొత్తం ఫీజులో ఎంతశాతం తగ్గించారో తెలపాలని హెచ్‌పీఎస్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులు చెల్లించలేదని ఆన్‌లైన్ తరగతులు ఎలా ఆపుతారని ప్రశ్నించిన హైకోర్టు.. ఆ చర్య పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని వ్యాఖ్యానించింది. ఫీజులతో ముడి పెట్టకుండా విద్యార్థులందరికీ ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని.. తొలగించిన వారికి తరగతులు పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. లాభాపేక్ష లేకుండా పనిచేసే సొసైటీలు కూడా కార్పొరేట్ సంస్థల్లా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంత మంది విద్యార్థుల నుంచి.. ఎంత మేరకు ఫీజులు రావాలో తమకు తెలపాలని హెచ్‌పీఎస్‌ను ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: SABITHA: జగన్ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్