రోజూ కనీసం లక్ష పరీక్షలు జరపాలని అనేక సార్లు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో ఒప్పంద, పొరుగు సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్న అంశంపై ఆరా తీసింది. ప్రాణాలకు తెగించి పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నించింది. వెంటనే వేతనాలు విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనా పరిస్థితులపై ధర్మాసనం విచారణ జరిపింది.
శెభాష్ పోలీస్
రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీసుల పనితీరును ప్రశంసించింది. లాక్‌డౌన్, కరోనా నిబంధనల అమలుపై డీజీపీ నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 98 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు విచారణకు హాజరయ్యారు.
పటిష్ఠ చర్యలు
ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మాస్కులు లేనివారిపై 3,39,412 కేసులు నమోదు చేశామని... రూ.31 కోట్ల జరిమానా విధించినట్లు వివరించారు. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు నమోదైనట్లు తెలిపారు. మూడు కమిషనరేట్ల పోలీసుల పనితీరు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది. పోలీసులందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది.
డీహెచ్ నివేదిక
కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) నివేదిక సమర్పించారు. ఈ నెల 1 నుంచి 14 వరకు సరాసరి 69,185 పరీక్షలు జరిపినట్లు తెలిపారు. దేశ సరాసరితో పోలిస్తే కరోనా పరీక్షల్లో వెనుకబడి లేమని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ఠ ధరలు గతంలోనే ఖరారు చేశామని అన్నారు. ఔషధాల ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదని కోర్టుకు డీహెచ్ విన్నవించారు. చికిత్స విధానాలు మారినందున సమీక్షించి తాజా జీవో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించింది.
స్టెరాయిడ్స్ లేకుండా చూడాలి
ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలపై వెబ్‌సైట్‌లో వివరాలు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవనే ఫిర్యాదులు వస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. కొవిడ్ బాధితులకు ఇస్తున్న కిట్‌లో స్టెరాయిడ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వివరాలు సమర్పించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రిసింగ్ అథారిటీని ఆదేశించింది.
ఇదీ చదవండి: కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్