హైదరాబాద్‌లోని ఖాజాగూడ చెరువుకు సంబంధించి 2014 నాటి పటాలను సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఖాజాగూడ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో రోడ్డు నిర్మిస్తున్నారని... ఆక్రమణలు జరుగుతున్నాయని సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి లుబ్నా సావత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
ఖాజాగూడ పెద్దచెరువు 37 ఎకరాలు ఉన్నట్లు హెచ్ఎండీఏ వెబ్ సైట్ పేర్కొందని.. అయితే 2014 ఫిబ్రవరి 25 నాటి రెండు పటాలు మాత్రం చెరువు 38 ఎకరాలకు పైగా ఉన్నట్లు చూపుతోందని అమికస్ క్యూరీ ప్రతాప్ కుమార్ హైకోర్టుకు వివరించారు. రెండు పటాల్లో సుమారు ఎకరం నుంచి ఎకరంన్నర వరకు తేడా కనిపిస్తోందన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. 2014 నాటి పటాలను తమకు సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?