Journalist Ankababu in CID custody: సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సెప్టెంబర్ 22న సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.
అంకబాబు సతీమణి ఎక్కడికి తీసుకెళ్తున్నారని వారిని ప్రశ్నించిగా.. తాము సీఐడీ అధికారులమని, గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉన్నట్లు అంకబాబు వాట్సప్‌లో పోస్టులు ఫార్వర్డ్ చేశారని, వాటిపై ప్రశ్నించేందుకు తీసుకెళ్తున్నామని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఓ అరగంట పాటు ప్రశ్నించి పంపించేస్తామంటూ అంకబాబును బలవంతంగా తీసుకెళ్లారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచారు. అయితే గురువారం రాత్రి 11.30 గంటల వరకూ అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అరెస్టు చేసినట్లుగానీ సీఐడీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇవీ చదవండి: