కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తమ ఆదేశాలను పట్టించుకోక పోవడం దురదృష్టకరమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సదుపాయాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
జూన్ నెల నుంచి పదే పదే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏ ఒక్క దానిని కూడా అధికారులు అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. బులెటిన్‌లో కీలకమైన వివరాలన్నీ ఉండాలని ఆదేశించినప్పటికీ అనుసరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదివారం బులిటెన్‌లో కూడా స్పష్టమైన వివరాలు లేవని ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై ఏం చర్యలు తీసుకోవాలో రేపు సీఎస్‌నే అడుగుతామని హైకోర్టు పేర్కొంది. కరోనాకు సంబంధించిన మరికొన్ని కేసుల్లో రేపు సీఎస్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈరోజు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అందుబాటులో లేనందున ఇవాళ్టి కేసులు కూడా రేపే విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం సీఎస్, ఉన్నతాధికారులు హాజరు కావాలని ఆదేశించింది.
ఇదీ చూడండి : ముఖ్యమంత్రిని ఆ వాహనంలోనే తీసుకెళ్తారా..? సీఎల్పీ నేత భట్టి