ఎండల తీవ్రత పెరగడానికి ప్రత్యేక కారణాలేమిటి?
వాతావరణ మార్పులతోపాటు, వడగాలులు ఎక్కువ ప్రాంతాల్లో వీస్తున్నందున ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి వచ్చే పొడి, వేడిగాలులతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
వడగాలులను గుర్తించేందుకున్న ప్రామాణికం ఏమిటి?
సాధారణంకన్నా 5 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత పెరిగితే ఆ ప్రాంతంలో వడగాలులు వీస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 40-46 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. మనిషి శరీరం 37 నుంచి 38 డిగ్రీల వేడిని మాత్రమే తట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు బయట తిరగడం మంచిది కాదు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెద్దగా నమోదు కాకున్నా ప్రజలు వేడిని తట్టుకోలేకున్నారు. ప్రధాన కారణమేమిటి?
మార్చి చివరిలో ఎండల తీవ్రత మొదలైనప్పుడు లాక్‌డౌన్ ఆరంభమైంది. అప్పట్నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే వారు బయటికి వస్తున్నారు. ఎండలు కూడా ఐదారు రోజులుగా బాగా పెరగడంతో తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఇంతవరకూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఎక్కడా నమోదు కాలేదు. అత్యధికంగా 46-47 డిగ్రీలే నమోదవుతోంది. ఇది గతంలోనూ వేసవిలో ఉన్నదే. ఎక్కువ రోజులు నీడన ఉన్నవారు ఒక్కసారిగా ఎండలోకి వస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఎండలో తిరగడం తగ్గించాలి.
కేవలం 10 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదు చేసి తీవ్రతను అంచనా వేయడం సరైన విధానమేనంటారా?
అది సరైన విధానమని చెప్పను. ప్రతి జిల్లాలో ఒక వాతావరణ కేంద్రం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. జిల్లాల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వమని కేంద్ర అధికారులు కోరారు. నివేదిక అందజేసిన తర్వాత కొత్త కేంద్రాల ఏర్పాటుకు అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆటోమేటిక్ వాతావరణ నమోదు కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం.