Telangana Weather Report: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండ వేడిమి నుంచి కొన్ని రోజుల పాటు ఉపశమనం లభించనుందని తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు డా.నాగరత్న వెల్లడించారు. ఆగ్నేయం, తూర్పు వైపుల నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని స్పష్టం చేశారు.
Telangana Weather updates : ఈ గాలుల ప్రభావంతో రేపు మధ్యాహ్నం నుంచి ఉత్తర-పశ్చిమ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని నాగరత్న పేర్కొన్నారు. 16న కామారెడ్డి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, నిజామాబాద్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక 17న కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించారు. పలుచోట్ల గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండొచ్చని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నాయుడుపేటలో రికార్డు స్థాయిలో..: ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని నాయుడుపేటలో 39.8 డిగ్రీల సెల్సియస్ ఎండ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో భద్రాచలం నిలిచింది. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతల కంటే సోమవారం రోజున రెండు డిగ్రీలు పెరుగుదల నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
పలుచోట్ల సాధారణం కన్నా తక్కువ..: ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల్లోనూ 39 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జీఎస్‌ఈ ఎస్టేట్‌తో పాటు వనపర్తి జిల్లా పెబ్బేరులో గరిష్ఠంగా 39.1 డిగ్రీల సెల్సియస్ ఎండ నమోదైంది. ఇక పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా ఎండపల్లిల్లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో మాత్రం సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లా రామగుండం, నల్గొండ, హైదరాబాద్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాత్రి సమయంలోనూ పలుచోట్ల సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కాస్త చలి వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి..
వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా ఆ సంస్థలతో ఇక్రిశాట్ ఒప్పందం
కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం మరోమారు వాయిదా.. కారణం అదేనా..!