భారీవర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు కొట్టుకుపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చాలా మండలాల్లో వరద ప్రభావం ఉంది. వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై కటాక్షాపూర్ చెరువు మత్తడి ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వరద ఉద్ధృతి పెరిగింది. ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. మంచిర్యాల సమీపంలోని రాళ్లవాగు పొంగిపొర్లింది. ఈ నీరంతా మంచిర్యాల పట్టణంలోని ఎన్‌టీఆర్‌నగర్, రాంగనర్, ఎల్‌ఐసీ కాలనీల్లోని ఇళ్లలోకి చేరింది.
* నిర్మల్ జిల్లాలో వరద ఉద్ధృతి తగ్గినా భారీ నష్టం వాటిల్లింది. స్వర్ణ ప్రాజెక్టు వరద కాల్వ పది చోట్ల భారీగా కోతకు గురైంది. జిల్లాలో దాదాపు 40 చెరువులకు గండ్లు పడ్డాయి. నిర్మల్‌లోని రోడ్లు దెబ్బతిన్నాయి. స్వర్ణ ప్రాజెక్టు నుంచి జీఎన్‌ఆర్ కాలనీలోకి వరదనీటితో కొట్టుకొచ్చిన బురద మేటలు వేసింది. 500 విద్యుత్తు స్తంభాలు, 50 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. నిర్మల్, కుంటాల, దిలావర్‌పూర్, భైంసా, సారంగపూర్ మండలాల పరిధిలో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు. భైంసాలో రోడ్లు కొట్టుకుపోయాయి. సారంగాపూర్ మండలం గోపాల్‌పేట్ మార్గంలో వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భైంసా మండలం పల్సిరంగారావు ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని గుండేగాం గ్రామస్థులు శుక్రవారం భైంసా పట్టణంలోని శివాజీ చౌక్‌ను దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు. దహెగాం మండలం గిరివెల్లి రహదారిపై నుంచి ఎర్రవాగు ఉప్పొంగడంతో 11 గ్రామాలకు, కాగజ్‌నగర్-పెంచికల్‌పేట మండలాల మధ్య బొంబాయిగూడ వద్ద ఎర్రవాగు ఉప్పొంగడంతో 15 గ్రామాల రాకపోకలకు నిలిచిపోయాయి.
* కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సర్దాపూర్ గ్రామానికి వెళ్లే దారి కొట్టుకుపోయింది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
* కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పొలాల్లో ఇసుక మేటవేసింది. చాలాచోట్ల కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామంలోని లోతుకుంట కట్ట తెగింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో రోడ్లు తెగిపోయాయి.
* వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ - భూపాలపట్నం 163 జాతీయ రహదారిలో ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ వద్ద ఉన్న లోలెవెల్ వంతెనపై నుంచి ప్రవాహం వెళ్తోంది. పక్కనే ఉన్న చెరువుకు వరద వస్తుండటంతో మత్తడి దూకుతోంది. ఏటా ఇక్కడ ఉన్న వంతెన మునిగిపోయి ప్రమాదకరంగా మారుతోంది.
* భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. దీంతో రాత్రి సమయంలో మాత్రం గేట్లు తెరుస్తున్నారు. అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ కాఫర్ డ్యామ్ (తాత్కాలిక ఆనకట్ట) మునిగిపోయింది.
బాధితులను రక్షించిన యంత్రాంగం
పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరదల కారణంగా గౌతమేశ్వరస్వామి దేవాలయం సమీపంలో 31 మంది నీటిలో చిక్కుకోగా, 16 మందిని అధికారులు బయటకు తీసుకొచ్చారు. అక్కడి పూజారి కుటుంబాలకు చెందిన 15 మంది మంథని రావడానికి ఇష్టపడక, అక్కడే ఉండిపోయారు. కోటపల్లి మండలం దేవులవాడ సమీపంలోని ప్రాణహిత నది పక్కన జైపూర్ విద్యుదుత్పత్తి సంస్థ నిర్మించిన పంపుహౌస్‌లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. కుమురం భీం జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లి వంతెన పనులు చేస్తున్న తొమ్మిది మంది కార్మికులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఇటుకబట్టీ కార్మికులను కాపాడిన ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా సుందిళ్ల ప్రాజెక్టు తిరుగుజలాల (బ్యాక్ వాటర్)తో గోదావరిఖని కోల్‌బెల్టు వంతెన సమీపంలో ఇటుక బట్టీ కార్మికుల ఇళ్లు నీట మునిగాయి. గురువారం రాత్రి 36 మంది నీటిలో చిక్కుకుపోయారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి రెస్క్యూ బృందం, పోలీసు అధికారులతో వెళ్లి బాధితులను బయటకు తీసుకొచ్చారు.
వరదకు అయిదుగురి బలి
వరద ప్రవాహ ఉద్ధృతి కారణంగా వివిధ జిల్లాల్లో అయిదుగురు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడి తండాలో వ్యవసాయ పనులకు వెళ్లి వస్తూ, రైల్వేట్రాక్‌పై నుంచి పెద్దవాగులో జారిపడి మందమర్రికి చెందిన మేసినేని చంద్రయ్య(36) చనిపోయారు. ఇదే మండలం సండ్రలపాడు గ్రామానికి చెందిన పశువుల కాపరి లచ్చన్న(56) వాగులో కొట్టుకుపోయారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం మిట్పల్లి సమీపంలో గురువారం రాత్రి కె.భీంరావు అనే హోంగార్డు ఒర్రె దాటుతుండగా ప్రవాహంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లా సిర్పూర్(యు) మండలానికి చెందిన ఆత్రం రాజేశ్వర్(50) శుక్రవారం సాయంత్రం చేపలు పట్టడానికి వెళ్లి నీటమునిగి చనిపోయారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్లతిమ్మాపురంలోని వట్టెవాగులో గల్లంతై తాటి రవి(35) అనే వ్యక్తి మృతి చెందారు.
ఇవీ చూడండి:
ts weather report: ఆ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
Lower Manner Dam: దిగువ మానేరుకు జలకళ.. ఆకట్టుకుంటోన్న డ్రోన్ దృశ్యాలు
Telangana projects inflow: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కొనసాగుతోన్న వరద ఉద్ధృతి
Ponds with water: భారీ వర్షాలతో జలకళ.. నిండుకుండల్లా చెరువులు
telangana floods: మత్తడి దూకుతున్న చెరువులు.. జనావాసాలు జలమయం...