AP Govt on Games For All Programme : ఈరోజుల్లో ఇరవై ఏళ్లకే అధిక బరువు, పాతికేళ్లకే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రజలను చుట్టుముడుతున్నాయి. పైగా వాకింగ్ అన్నది మర్చిపోయి వాహన వినియోగం విపరీతంగా పెరగడం, వ్యాయామం చేయకపోవడం, స్మార్ట్ఫోన్లు, టీవీల ధ్యాసలో పడి ఆటలకు దూరంగా ఉండటమే ఇలాంటి రుగ్మతులకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి జీనవశైలి వ్యాధులను అధిగమించేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు, ప్రజలు, అందరికీ ఆటలు పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. కొత్త క్రీడా విధానంలో భాగంగా ప్రతిరోజూ కొంత సమయం ఆటలకు కేటాయించేలా ఏర్పాట్లు చేయనుంది.
ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులకు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు వివిధ క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం, ఇతర సంస్థల సహకారం తీసుకోనుంది. ఇప్పటికే కొత్త క్రీడా విధానం ముసాయిదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలో 'అందరికీ ఆటలు' ప్రతిపాదన గురించి చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు ప్రతిరోజూ ఆటలకు కొంత సమయం కేటాయించేలా పనిచేసే ప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రతిపాదించారు. ఉద్యోగులే కాకుండా వివిధ వృత్తుల్లో ఉండే ప్రజలు, యువతకు సైతం ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయాలని చంద్రబాబు ఆదేశించారు.
తొలుత సచివాలయంలో 'అందరికీ ఆటలు' కార్యక్రమం : ఈ మేరకు అధికారులు అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు ప్రతిరోజు షటిల్, వాలీబాల్ ఆడేలా ఏర్పాటు చేయాలి. ఒకవేళ స్థలం లేకపోతే టేబుల్ టెన్నిస్ అయినా ఆడాలి. రోజూ సాయంత్రం కనీసం 30 నిమిషాలైనా ఉద్యోగులు ఆడేలా చూడాలి. మహిళలకు చెస్, టెన్నికాయిట్, యోగ, క్యారమ్స్ వంటివి ఏర్పాటు చేయాలి.
మొదట ఏపీలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. 2014 -19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. ప్రజల నుంచి ఎలాంటి రసుములు వసూలు చేయకుండా దీని నిర్వహణను పట్టణ స్థానిక సంస్థలకే అప్పగించనున్నారు. ఇదే తరహా కార్యక్రమాలను దశల వారీగా గ్రామాల్లోనూ అమలుచేయాలని ఏపీ సర్కారు భావిస్తుంది.
‘అందరికీ ఆటలు’ కార్యక్రమం ప్రణాళిక ఇలా
- పట్టణాల్లో క్రీడాకు సంబంధించిన సదుపాయాలు పెంచడం
- విద్యాసంస్థల్లోనూ క్రీడా సదుపాయాలు
- నివాస ప్రాంతాల్లో గ్రౌండ్ అభివృద్ధి
- ఉద్యోగుల పని ప్రదేశాల్లో ఆటల నిర్వహణ
- యోగా కేంద్రాలు ఏర్పాటు
- ప్రజల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచేలా కార్యక్రమాల నిర్వహణ
- ప్రతి గ్రామంలోనూ క్రీడా మైదానం
- క్రీడల్లో పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యం
ఆరోగ్య సిరులు ప్రసాదించే 'చిరు ధాన్యాలు' - ఏది తింటే ఎంత శక్తి వస్తుందో తెలుసా?
రోజుకు 5 నిమిషాల పరుగుతో అన్ని ఆరోగ్య సమస్యలకు చెక్! - హాస్పిటల్ వైపు కూడా చూడరు!!