Heavy rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత నెల రోజులుగా తన ప్రతాపాన్ని చూపించిన భానుడు.. వరుణ దేవుడు పలకరించడంతో కాస్త చల్లబడ్డాడు. గత రెండు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు రోడ్లు, డ్రైనేజీల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కుండపోతగా పడిన వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో కొందరికి ఎంతో హాయిగా ఉన్నా.. అకాల వర్షాలు, దానికి తోడు వడగళ్లతో ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rains in Hyderabad: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శనివారం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా.. సాయంత్రం 5 గంటల సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారి.. వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, శామీర్‌పేట, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. కుండపోత వానతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో మోకాలు లోతు నీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు బలంగా వీచడంతో నూతన సచివాలయం సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. గాజులరామారంలో గరిష్ఠంగా 4.35 సెం.మీ వర్షం పడగా.. కనిష్ఠంగా బాలానగర్‌లో 1.58 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
వరంగల్ జిల్లాలో: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇప్పటికే రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. తాజాగా వడగళ్ల వాన పడటంతో రైతులకు శాపంగా మారింది. వర్షం ప్రభావంతో చిట్యాల, టేకుమట్ల, రేగొండ మండలాల్లో రాత్రి నుంచి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుంచి ఉదయం వరకు ఏకధాటిగా వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. వడగళ్ల వర్షం పడటంతో సిమెంట్ రేకుల ఇళ్ల వారు ఇబ్బందిపడ్డారు. వాటి ధాటి నుంచి కాపాడుకోవడానికి ఇళ్లపై కొబ్బరి ఆకులు, వరి గడ్డితో కప్పుకొని కాపాడుకున్నారు.
గోడ కూలి 20 గొర్రెలు మృతి: సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వడగళ్ల వర్షం పడటంతో మామిడి పండ్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో మరికొద్ది రోజుల్లో చేతికి రాబోతున్న వరి పంట నేలకొరిగింది. జిల్లాలోని తిరుమలగిరి-తొర్రూరు ప్రధాన రహదారిపై వృక్షాలు నేలకొరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిబండ తండాలో గోడ కూలి 20 గొర్రెలు మృతి చెందాయి.
వడగళ్ల వానతో రైతుల కళ్లలో కన్నీరు: రాష్ట్రవ్యాప్తంగా వడగళ్ల వర్షాలు పడటంతో రైతల కళ్లలోంచి కన్నీరు వస్తోంది. ముఖ్యంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్లు మామిడి కాయలపై నేరుగా పడటంతో కాయలు దెబ్బతిని కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలుల ప్రభావంతో మొక్కజొన్న, అరటి, బొబ్బాయి, వరి పంటలు నేలకొరిగాయి. అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిచి ముద్దయింది.
ఇవీ చదవండి:
ఇది వడగండ్ల వర్షమా.. లేక గన్ ఫైరింగా..?
రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు.. పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు