రాష్ట్రవ్యాప్తంగా వర్షాల (Rains)తో జనజీవనం స్తంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వరద ఉద్ధృతికి కొత్తగా నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లు నీటమునిగాయి. ఎగువప్రాంతం నుంచి భారీగా వరద చేరుకోవడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు మునిగిపోయింది.
భక్తుల ఇబ్బందులు...
యాదాద్రి బాలాలయం చేరుకునే రహదారిలో మట్టి కొట్టుకుపోవడం వల్ల కాలినడకన వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భువనగిరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
నిర్మల్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది. శివాజీ చౌక్, బస్టాండ్, డాక్టర్ లైన్, వివేక్ చౌక్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది.
రాకపోకలకు ఇబ్బంది...
జగిత్యాల జిల్లాలో రహదారులపై నీళ్లు పారుతుండటం వల్ల రాకపోకలు స్తంభించాయి. కోరుట్ల మండలం ఏకిన్‌పూర్ వాగులో ఇద్దరు చిక్కుకోగా వారిని స్థానికులు కాపాడారు. మేడిపల్లి మండలం పెద్దవాగు పొంగటంతో పసునూరు-రాజలింగంపేట మధ్య రాకపోకలు స్తంభించాయి. మెట్‌పల్లి మండలం రంగారావుపేట కల్వర్టుపై నుంచి నీళ్లు పారుతున్నాయి.
ఇందూర్ అతలాకుతలం..
నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్ నగరం, నందిపేట్, చందూర్, మోస్రా, బోధన్, బాల్కొండ, మెండోరా, రుద్రూర్, ఎడపల్లి, దర్పల్లి, డిచ్‌పల్లి, సిరికొండ తదితర మండలాల్లో వర్షం పడింది. నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ రైల్వే కమాన్‌కింద మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే కమాన్ నుంచి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, నార్త్ తహసీల్దార్ కార్యాలయం వరకు నీళ్లు నిలిచిపోయాయి. బోధన్ రోడ్డు, చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఉప్పొంగిన చెరువులు...
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గ్రామాల్లో చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వస్తున్న వరదతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందివాగు, మానాలలోని తాతమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రుద్రంగి నుంచి మానాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వంతెన పైనుంచి...
సిద్దిపేట జిల్లా బస్వాపూర్ ప్రధాన రహదారి వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. గత ఏడాదిలోనూ ఇదే వంతెనపై నుంచి మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో లారీతో సహా డ్రైవర్ కొట్టుకుపోయి మృతి చెందాడు. వాగుపై హైలెవల్ వంతెనను నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: HEAVY RAINS: రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు!