కుండపొత వర్షాలతో రాజధాని నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. రాత్రంతా భారీగా ఉరుములు, మెరుపులతో నగరం వణికిపోయింది. వివిధ జిల్లాల్లో పంటలు నీట మునిగిపోయాయి.
ఇవాళ, రేపు భారీ వర్షాలు
బుధ, గురువారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం... మధ్యప్రదేశ్ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడ్డాయి. ఈ రెండింటి కారణంగా తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
నీట మునిగిన కాలనీలు
కుండపోత వర్షంతో మంగళవారం రాజధాని నగరం చిగురుటాకులా వణికిపోయింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో విడతల వారీగా కుంభవృష్టి కురవడం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీలు, బస్తీల్లో రోడ్లపై నిలిపిన పలు ద్విచక్రవాహనాలు, ఆటో రిక్షాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపు నీటిలో చిక్కుకున్నాయి. శ్రీనగర్‌కాలనీ, నేరెడ్మెట్ష కాప్రా, ఏఎస్రావు ప్రాంతాల్లోనూ వరద పోటెత్తింది. ఎల్బీనగర్ చుట్టుపక్కల కాలనీల్లో వరదనీరు తీవ్రమై నాలాలు పొంగిపొర్లాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 60.7 మిల్లీమీటర్ల నుంచి 121.8 మిల్లీమిటర్ల వరకు వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా నగరం నలువైపులా రాకపోకలు స్తంభించిపోయాయి. వేలాదివాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
కొనసాగితే పంటలకు నష్టం
పలు ప్రాంతాల్లో కొద్ది గంటల వ్యవధిలో కురిసిన వానకుపొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షాలిలాగే కొనసాగితే నష్టం అధికంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోని నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.
వర్షపాతం వివరాలివి.
- పెద్దపల్లి జిల్లా రంగంపల్లి -146.5 మిల్లీమీటర్లు
- రంగారెడ్డి జిల్లా మంఖాల్-141.3 మిల్లీమీటర్లు
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్-134.5 మిల్లీమీటర్లు
- మంచిర్యాల- 133.8 మిల్లీమీటర్లు
హైదరాబాద్‌లో...
- తిరుమలగిరి-121.8 మిల్లీమీటర్లు
- శాంతినగర్-120.8 మిల్లీమీటర్లు
- చిలుకానగర్ -120.8 మిల్లీమీటర్లు
- వెస్ట్‌మారేడ్‌పల్లి-114.5 మిల్లీమీటర్లు