హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లక్డీకపూల్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, సైదాబాద్, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాధిగూడ, మేడిపల్లి, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం పడుతోంది. వర్షపు నీరు రహదారులపైకి చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాతబస్తీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, జహనుమ, బహదూర్ పురా, ఫలక్‌నుమా, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్‌లో భారీ వర్షం పడింది. కార్యాలయాలు, వ్యాపారాలు ముగించుకొని ఇంటికి చేరుకునే ప్రజలు వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల వరకు వర్షం కురిసే అవకాశముందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. సాయం కోసం 040-29555500 నంబర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
అంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా అధికారులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో ఇరు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు గచ్చిబౌలి-మెహిదీపట్నం మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయదుర్గం వద్ద రోడ్డుపై భారీగా వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. రాయదుర్గం మల్కం చెరువులోకి భారీగా నీరు చేరుతోంది. మల్కం చెరువు పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను రంగంలోకి దించారు.
నేలకూలిన వృక్షం..
భారీ వర్షానికి కింగ్ కోఠి ఆసుపత్రి వద్ద భారీ వృక్షం నేలకూలింది. రోడ్డు మధ్యలో పడిపోవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు వృక్షాన్ని రోడ్డుపై నుంచి తొలిగించేందుకు యత్నిస్తున్నారు.
Weather Report: వాయుగుండం తీవ్రరూపం.. తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు!